పదేళ్ల క్రితం నాటి సినిమాకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కి బిగ్ షాక్

  • ఆదాయపు పన్ను అవకతవకల ఆరోపణలపై రిట్ పిటిషన్ దాఖలు
  • విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్
  • చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగన్‌ల ధర్మాసనం విచారణ
2015లో విడుదలైన తమిళ చిత్రం 'పులి'కి సంబంధించిన ఆదాయపు పన్ను అవకతవకల ఆరోపణలపై నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగన్‌ల ధర్మాసనం విచారించింది.

ఈ పిటిషన్‌ గత  నెలలో దాఖలైనప్పటికీ, రిజిస్ట్రీ మొదట్లో ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదు. ఇది స్వీకరించదగినదా, లేదా అనే సందేహాలపై రిజిస్ట్రీ ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదని గమనించిన ప్రధాన న్యాయమూర్తి, ఈ పిటిషన్ విచారణార్హమైనదిగా భావించారు. ఈ పిటిషన్‌ను చెన్నైకి చెందిన ఎం. రాజ్ కుమార్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ప్రకారం, 2015 సెప్టెంబర్ 30న విజయ్‌కి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు జరిపి, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అధికారులు గుర్తించారని తెలుస్తోంది. రికార్డుల ప్రకారం, సినిమా పారితోషికంగా విజయ్‌కు చెక్కు రూపంలో రూ.16 కోట్లు చెల్లించారు. అదనంగా రూ.4.93 కోట్లను నగదు రూపంలో చెల్లించారు. వీటికి లెక్కలు చూపలేదని ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలకు పన్ను చెల్లింపులు జరగలేదని ఐటీ అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో, ఐటీ అధికారులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, విజయ్‌కి సంబంధించిన సెర్చ్ ప్రొసీడింగ్స్, అఫిడవిట్లు, పెనాల్టీ ఆర్డర్లను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు రాజ్ కుమార్ కోర్టును కోరారు. ఈ కేసును మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.

సోదాలు, చట్టపరమైన విచారణ సందర్భంగా ఆదాయాన్ని చెప్పకపోవడం, లెక్కల్లో చూపని నగదును పారితోషికంగా తీసుకోవడం, ఆర్థిక లావాదేవీలు దాచిపెట్టడం వంటి వాటికి సంబంధించి వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో కోరారు.

Vijay TVK
Vijay actor
Tamil film Puli
Income tax raid
Tax evasion allegations
Madras High Court

More Telugu News